Story Switch to 2-Column WhatsApp
maneti.in
29 November 2026, 10:58 AM Warangal By: MaaNeti News

అభివృద్ధి మాటున రాజకీయ పావులు వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వెనుక ఎన్నికల వ్యూహాలున్నాయా?

అభివృద్ధి మాటున రాజకీయ పావులు వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వెనుక ఎన్నికల వ్యూహాలున్నాయా?

నగర అభివృద్ధిపై సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. బీజేపీ సైతం రంగప్రవేశం

మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీల ఎత్తుగడలపై జోరుగా చర్చ

వరంగల్ బ్యూరో, మానేటి న్యూస్, నవంబర్ 30,

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నగర అభివృద్ధి అంశం కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. అభివృద్ధి పనులపై జరుగుతున్న విమర్శలు, ప్రతివిమర్శల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజా సమస్యలపై చర్చించడమే లక్ష్యమా? లేక రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా పైచేయి సాధించేందుకు సాగుతున్న వ్యూహమా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభతో ఈ రాజకీయ పరిణామాలకు మరింత ఊపొచ్చింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వరంగల్ నగరానికి చేపట్టిన అభివృద్ధి పనులను వీడియోల ద్వారా ప్రజలకు వివరించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తూ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు.

ఈ క్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించగా, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సైతం ప్రతిసవాల్ విసిరారు. తాము కూడా చర్చకు సిద్ధమేనని ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. ఒకవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతుండగా, మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నాయకులు సమాయత్తం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరుపార్టీల నేతల ఆందోళనలు, పరస్పర సవాళ్ల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేయడంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

ఎన్నికలే అసలు లక్ష్యమా?

ఈ పరిణామాల వెనుక రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎన్నికలకు ముందుగానే ప్రజల్లో తమ పార్టీ ఉనికిని చాటుకోవడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా సవాల్ విసరడం వంటి లక్ష్యాలతోనే ఇరు పార్టీల నేతలు అభివృద్ధి అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యూహాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

గతంలోనూ వరంగల్ నగరంలో పలు ప్రజా సమస్యలు రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. భద్రకాళి ఆలయం సమీపంలోని గుడిసెల తొలగింపు, వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసుల సమస్యలు, షాన్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయ భూముల వ్యవహారాలు రాజకీయ ఆందోళనలకు దారితీశాయి. ఆయా సందర్భాల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన రాజకీయ పార్టీలు వాటిని రాజకీయ వేదికలుగా మార్చుకుంటున్నాయనే విమర్శలు కూడా వినిపించాయి.

బీజేపీ సైతం రంగంలోకి

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న అభివృద్ధి పోరులో బీజేపీ సైతం తన వాదనను తెరపైకి తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే వరంగల్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నగరానికి చేసిన అభివృద్ధిపై ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిపై చర్చ జరగాల్సిందే కానీ, కార్యాలయాల ముట్టడులు, రాజకీయ ఆందోళనలతో ప్రయోజనం ఏమిటని నిలదీస్తున్నారు.

ప్రజలకు కావాల్సింది రాజకీయ పోరాటమా? అభివృద్ధి ఫలితాలా?

మొత్తంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్యక్రమాలు, కేంద్రం అందించిన నిధులు.. ఇలా ప్రతి అంశం రాజకీయ విమర్శలకు వేదికగా మారుతోంది. అయితే పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకే ఈ వ్యవహారం పరిమితం కాకుండా నగరానికి వచ్చిన నిధులు ఎంత? పూర్తయిన పనులెన్ని? పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులేమిటి? ప్రజలకు అందిన ప్రయోజనాలెంత? అనే అంశాలపై ఆధారాలతో కూడిన బహిరంగ చర్చ జరగాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఎన్నికల రాజకీయాల్లో భాగంగా అభివృద్ధి అంశం ప్రధాన చర్చగా మారినా, చివరకు దాని ఫలితాలు ప్రజలకు అందాయా లేదా అన్నదే కీలకం. రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడం కంటే నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాయా? లేక ఎన్నికల వరకు ఈ విమర్శలు, ప్రతివిమర్శలే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.