ఘనంగా వరంగల్ జోనల్ స్థాయి మాస్టర్ ఓరేటర్ పోటీలు.
వరంగల్ బ్యూరో, మానేటి న్యూస్, నవంబర్ 29,
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వరంగల్ జోనల్ స్థాయి మాస్టర్ ఓరేటర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండలోని ఐశ్వర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రసంగ నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ మండల విద్యాధికారి నెహ్రూ నాయక్, కాజీపేట మండల విద్యాధికారి మనోజ్ కుమార్, వరంగల్ జోన్ నారాయణ విద్యాసంస్థల డిప్యూటీ జనరల్ మేనేజర్ రిజ్వానా ఇమ్రాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీలో అద్భుతమైన అంశాలను ఎంచుకుని, వాటిపై తమకున్న అవగాహన, ఆలోచనా శక్తి, వాక్చాతుర్యాన్ని చక్కగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
మండల విద్యాధికారి నెహ్రూ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో వేదికపై నిలబడి, స్పష్టమైన ఉచ్చారణతో, అర్థవంతమైన మాటలతో, అద్భుతమైన భావవ్యక్తీకరణతో తన ప్రతిభను చాటుకున్నారని ప్రశంసించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
నారాయణ విద్యాసంస్థల డిప్యూటీ జనరల్ మేనేజర్ రిజ్వానా ఇమ్రాన్ మాట్లాడుతూ.. మాటల్లో స్పష్టత, ఆలోచనల్లో గొప్పతనం, ప్రదర్శనలో ఆత్మవిశ్వాసం నారాయణ విద్యార్థుల ప్రత్యేకత అని అన్నారు. విద్యార్థుల్లో కేవలం ప్రసంగ నైపుణ్యాలనే కాకుండా నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనలు, ధైర్యం, సమాజం పట్ల అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తాము కేవలం మంచి వ్యక్తులను మాత్రమే తయారు చేయడం లేదని, రేపటి సమాజానికి మార్గనిర్దేశం చేసే నాయకులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
అనంతరం నక్కలగుట్ట నారాయణ స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, కృషి అభినందనీయమని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జోనల్ నారాయణ హైస్కూల్ కోఆర్డినేటర్ ఏ. సాయికృష్ణ, శ్యామల, శిరీష, ఆర్ఎల్టీ లక్ష్మపతి, లైఫ్ స్కిల్స్ ట్రైనర్లు మేఘన, వీణ, వైస్ ప్రిన్సిపాల్ అనూష, పీఈటీ బాలకృష్ణతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.